విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌పై మండిపడ్డ టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు - టాక్స్ పేయర్స్ అసోసియేషన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 12, 2023, 4:26 PM IST
Tax Payer Association Fires On VMC:విజయవాడలోని ఖాళీ స్థలాల యజమానుల వివరాలు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద లేకపోవటం దారుణమని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు విమర్శించారు. నగరంలో ఖాళీ స్థలాలు పల్లంగా ఉండటంతో వర్షపు నీరు నిలిచి దోమలు, ఈగలకు ఆవాసాలుగా మారాయన్నారు. దీంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ఖాళీ స్థలాల వివరాలు వీఎంసీ సేకరించకపోవడంతో ఆదాయం కోల్పోతుందన్నారు. నగరంలోని ఖాళీ స్థలాలు నిర్వహణ లేక పిచ్చిమొక్కలు పెరిగి పాములకు ఆవాసాలుగా మారాయని తెలిపారు.
Vijayawada Municipal Corporation :ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో కొనుగోలుదారుని నుంచి మ్యుటేషన్ చార్జీలు వసూలు చేస్తారని వాటి వివరాలు వీఎంసీలో (vijayawada municipal corporation) రికార్డు చేయకపోవడం వీఎంసీ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. నగరంలోని ఖాళీ స్థలాలు కొనుగోలు, అమ్మకాలు జరిగినా వాటి సమాచారం మున్సిపల్ రికార్డుల్లో లేకపోవడమేంటని ప్రశ్నించారు. తక్షణం ఖాళీ స్థలాల వివరాలు సేకరించి వాటి నిర్వాహణ బాధ్యత యజమానులకు అప్పజెప్పాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు.