Tammileru Reservoir Water Level: నిండుకుండలా తమ్మిలేరు జలాశయం.. 343 అడుగులకు చేరిన నీటిమట్టం - తమ్మిలేరు జలాశయం నీటిమట్టం
Today Water Flow to Tammileru Reservoir: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా గత వారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు తోడు, ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. ఈ సంవత్సరం తొలకరిలొ మొహం చాటేశాడనుకున్న వరుణుడు.. ఆలస్యంగానైనా కురవడంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లాలోని చింతలపూడి తమ్మిలేరు జలాశయానికి వస్తున్న వరద నీరు కారణంగా ప్రాజెక్ట్ నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 355 అడుగులు కాగా.. ప్రస్తుతం 343.32 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 4వేల 460 క్యూసెక్కుల నీరు జలాశయానికి వస్తోంది. వరద ఉద్ధృతి ఇలానే కొనసాగితే జలాశయ నీటిమట్టం 348 అడుగులకు చేరుతుందని జలవనరుల అధికారులు తెలిపారు. దీంతో రిజర్వాయర్ మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.