Tadikonda Group Politics: 'ఇలాగైతే గెలుపు కష్టమే'.. తాడికొండ వైసీపీలో రచ్చకెక్కిన వర్గపోరు - గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం వైసీపీ
Group Politics Busted in Tadikonda: గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడుతోంది. శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేశారనే నెపంతో.. ఆమెను పార్టీకి దూరం పెట్టారు. శ్రీదేవి పార్టీలో ఉండగానే నియోజకవర్గ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను అధిష్ఠానం నియమించింది. ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో సమన్వయకర్త పదవిని కత్తెర సురేష్‌కు కేటాయించారు. అయితే, సురేష్ మాత్రం స్థానిక నేతలు, కార్యకర్తల్ని కలుపుకుని ముందుకు వెళ్లడంలేదని తుళ్లూరు వైసీపీ మండల నాయకులు మాదల మహేంద్ర, కంతేటి వెంకటేశ్వరరావు, గాదె నాగేశ్వరరావు, నాయుడు నాగేశ్వరరావు, తోట శ్రీను, షఫి, కాకాని నాగేశ్వరరావు మీడియా ముందు వాపోయారు.
సురేష్ తనకు నచ్చిన వారికే పార్టీ పదవులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. మండలంలో నిర్వహించే ఏ కార్యక్రమమైనా.. పార్టీ నాయకులకు చెప్పకుండా తన ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని, స్వంతపార్టీ నేతలే విమర్శలు గుప్పించారు. సురేష్ తీరుపై ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ గెలిచే పరిస్థితి లేదని వారు తెలిపారు.