Suicide Attempt: న్యాయం చేయాలంటూ.. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం
Skill Development Trainers suicide attempts:అధికారంలోకొచ్చాక ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. కానీ, ఉన్న ఉద్యోగమూ పీకేశారు. వేతనాలు పెంచుతామన్నారు. కానీ.... పాత బకాయిలిచ్చే దిక్కూ లేదు. రెండేళ్లుగా.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగితిరిగీ అలిసి పోయాయిన నైపుణ్య వికాసం ప్రాజెక్టు ట్రైనర్లు.. ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.
రాష్ట్రం సామాజిక సంక్షేమ, గిరిజన సంక్షేమ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాల్లో విద్యార్థులకు ఇంగ్లీష్ సహా కంప్యూటర్ పరిజ్ణానం పెంచేందుకు గత ప్రభుత్వం 2018 లో శిక్షకులను నియమించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2021లో 854 మంది ట్రైనర్లను తొలగించారు. అప్పటికే.. 11 నెలల వేతనాల బకాయిలున్నాయి. అప్పటి నుంచీ వీళ్లు బకాయిల కోసం.... తిరుగుతూనే ఉన్నారు. సోమవారం మరోసారి స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయం వద్దకు వచ్చారు. ఈసారీ వాళ్లకు భరోసా దొరకలేదు. ఇక మనస్థాపానికి గురైన ముగ్గురు ట్రైనర్లు శీతలపానీయంలో... పురుగుల మందుకలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
విషయం తెలుసుకున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఓఎస్డీ సహా ఉన్నతాధికారులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. మంగళగిరి ఎయిమ్స్‌లో... చికిత్స అందిస్తున్నారు. పాదయాత్రలో మాట ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక మడమతిప్పారని
బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం కార్యాలయంలో, స్పందనలో వినతి పత్రాలిచ్చినా పట్టించుకోలేదంటున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికీ పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు ఇవ్వకపోతే.. అందిరకీ ఆత్మహత్యే శరణ్యమని నైపుణ్య వికాసం ప్రాజెక్టు మాజీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
'గత కొంతకాలం నుంచి న్యూ నాబార్డ్ స్కూల్లో వర్కర్స్‌గా పని చేశాం. దాదాపుగా 11 నెలలుగా మాకు రావాల్సిన జీతాలు ఇవ్వలేదు. జీతాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం. సుమారు 854 మంది పని చేస్తున్నాం. మా సమస్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి పలు దఫాలుగా కలిసి విన్నవించుకున్నాం. అయినా మా సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ రోజు మా సమస్యలపై అధికారులను కలవడానికి ఇక్కడికి వచ్చాం. ఇంతలో మా సహచర ఉద్యోగులు ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు.'- స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనర్