సింహాద్రి అప్పన్నకు వైభవంగా స్వర్ణ తులసి దళార్చన - నేత్రపర్వంగా సాగిన కళ్యాణోత్సవం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 9, 2023, 4:07 PM IST
Swarna Tulasi Dalarchana at Simhachalam Kshetram: విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామికి స్వర్ణ తులసి దళార్చన వైభవోపేతంగా జరిగింది. గురువారం ఏకాదశి సందర్భంగా సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వామివారికి వైభవంగా పూజలు నిర్వహించారు. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణ తులసి దళార్చనను, 108 బంగారు పుష్పాలతో అభిషేకం నిర్వహించారు.
Varaha Lakshmi Narasimha swamy Nitya Kalyanam: వరాాహ లక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పారు. పాంచరాత్రాగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగల్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనం నిర్వహించారు. అనంతరం భక్తులకు వేదాశీర్వచనాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.