Tension at Kurnool: అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే 'లా అండ్ ఆర్డర్' సమస్య: ఎస్వీ మోహన్ రెడ్డి - Avinash arrest news
Suspense continues over Avinash Reddy Arrest: కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేస్తే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యంతో ఉండడంతో ఎంపీ సీబీఐ విచారణకు హాజరు కావడం లేదని ఆయన వెల్లడించారు. ఆరోగ్యం మెరుగై.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినా తర్వాత విచారణకు వెంటనే హాజరవుతారని ఎంపీ తెలిపినట్లు ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. సీబీఐ అధికారులు స్పందించి విచారణకు గడువు ఇవ్వాలని ఆయన కోరారు.
తమ నాయకుడు వైయస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దంటూ వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. కర్నూలు నగరంలోని విశ్వభారతి ఆసుపత్రి వద్దకు చేరుకున్న ఆ పార్టీ కార్యకర్తలు నల్ల రిబ్బన్లు ధరించి నినాదాలు చేశారు. కర్నూలు నగరంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కోరారు. తల్లి ఆరోగ్యం దృష్ట్యా.. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలిపారు.