రుషికొండ నిర్మాణాలపై సుప్రీంకోర్టులో విచారణ - హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్‌కు సూచన - Rushikonda
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 3, 2023, 4:35 PM IST
SC Hearing on Rushikonda Constructions Petition:విశాఖపట్టణంలో ఉన్న రుషికొండను తొలచి, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. దాఖలైన పిటిషన్‌పై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్ట్)లో విచారణ జరిగింది. విచారణలో భాగంగా హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్‌కు న్యాయస్థానం సూచించింది.
అసలు ఏం జరిగిందంటే..విశాఖలోని రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయం, సీనియర్ అధికారుల కార్యాలయాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 11, 2023న జీవో జారీ చేసింది. ఆ జీవోను సవాలు చేస్తూ.. అక్టోబర్ 19, 2023న పర్యావరణవేత్త లింగమనేని శివరామ్ ప్రసాద్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌లో.. రిషికొండను తొలచి, అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా.. కొండపై సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసేలా జీవో జారీ చేశారని పేర్కొన్నారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో రుషికొండ అక్రమ తవ్వకాలు, నిర్మాణాలపై శివరామ్ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్ట్ విచారణ జరిపింది. అనంతరం రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి.. రాష్ట్ర హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్‌కు ఆదేశించింది.