ఏసీబీ వలలో సబ్ ఇంజినీర్ - రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు - Konaseema District News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 22, 2023, 6:30 PM IST
Sub Engineer Caught by ACB Officials While Taking Bribe : రైతు వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సబ్ ఇంజినీర్ పట్టుబడిన ఘటన కోనసీమ జిల్లాలో కలకలం రేపింది. అడిషనల్ ఎస్పీ సౌజన్య తెలిపిన వివరాల ప్రకారం, మండపేట మండలం దుళ్ల గ్రామానికి చెందిన ముల్లపూడి శ్రీనివాసరావుకు వ్యవసాయ భూమి ఉంది. దీనికి నీటిపారుదల సౌకర్యం కోసం విద్యుత్ అధికారులను రైతు ఆశ్రయించారు. వీటికి సంబంధించిన పనులపై ఎస్టిమేషన్ వేయడానికి రైతు వద్ద సబ్ ఇంజనీర్ రూ. 70,000 వేల లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయంపై రైతు రాజమండ్రి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అడిషనల్ ఎస్పీ సౌజన్య వేసిన పథకం ప్రకారం ఏసీబీ అధికారులు సబ్ స్టేషన్ వద్ద మాటు వేశారు. ముందుగా రూపొందించిన పథకం ప్రకారం రైతు రూ.70,000 నగదును సబ్ స్టేషన్లో ఉన్న సబ్ ఇంజినీర్ ప్రసాద్‌కు అందజేశాడు.
వెంటనే ఆయన తన డైరీలో ఆ నగదు పెట్టుకున్నారు. ఊహించని రీతిలో మెరుపు దాడి చేసిన ఏసీబీ అధికారులు సబ్ ఇంజినీర్ ప్రసాద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ సౌజన్య మాట్లాడుతూ, ప్రజల పనులను అధికారులు డబ్బులు లేకుండా నిస్వార్ధంగా చేపట్టాలని తెలిపారు. ఈ విధంగా స్వార్థ బుద్ధితో లంచం తీసుకుంటే శిక్షకు గురవుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ కార్యాలయాలు అన్ని జిల్లాల్లో ఉన్నాయని ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే ముందుగా తమను ఆశ్రయించాలని ఆమె కోరారు. సబ్ ఇంజినీర్ ప్రసాద్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు తెలిపారు.