మంత్రిగారి మెప్పు కోసం నేతల అత్యుత్సాహం - విచిత్ర వేషధారణలతో హడలిపోయిన విద్యార్థులు - Peddireddy comments
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 6:02 PM IST
Students Run Away in Peddireddy Ramachandra Reddy Tour:మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గ పర్యటన కోసం వస్తున్నారని వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేశారు. మంత్రిని ఆనంద పరచడానికి విచిత్ర వేషధారణలతో స్వాగతం పలికారు. అయితే మంత్రి మెప్పు కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు స్కూల్ పిల్లలకు ఇబ్బందిగా మారిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది.
శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. మంత్రి పర్యటన నేపథ్యంలో హిందూపురం గ్రామీణ మండలంలో విచిత్ర వేషధారణలు, డీజేలతో స్వాగతం పలికారు. మంత్రి కాన్వాయ్ అటుగా వెళ్తున్న సందర్భంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. అయితే పాఠశాల ఉన్నప్పటికీ సమన్వయం పాటించకుండా, డీజే విచిత్ర వేషాలలో ఉన్న వ్యక్తులు స్కూల్ పిల్లల్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ, ఇవేం పట్టనట్లుగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వారు చేసే విన్యాసాలు తిలకిస్తూ ఉండిపోయారు. ఆ కళాకారులు మరింత అత్యుత్సాహంతో పాఠశాల ప్రాంగణంలోకి దూసుకువచ్చారు. దీంతో అక్కడ ఉన్న విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. కళాకారుల చేష్టలపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమంలో ఇలా ఇబ్బందులకు గురి చేయడంపై విమర్శలు గుప్పించారు. విచిత్ర వేషధారణలతో విద్యార్థుల మీదకు పరిగెత్తడంతో వారు హడలి తరగతి గదుల్లోకి పరుగులు తీశారు. ఇక మంత్రి పర్యటన అయ్యేంత వరకూ విద్యార్థులు బయటే కూర్చున్నారు. మంత్రి పర్యటన కోసం విద్యార్థుల సమయాన్ని వృథా చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.