Students Protest For Roads: "జగనన్న మా గ్రామానికి రోడ్డు వేయండి".. మోకాళ్లపై నిల్చోని విద్యార్థుల నిరసన
Students Protest For Roads in Nellore: స్కూలుకు వెళ్లి చదువుకోవాల్సిన చిన్నారులు.. రోడ్డు మీదకొచ్చి ధర్నాలు చేస్తున్నారు. తమ మొర ఆలకించాలని ముఖ్యమంత్రిని వేడుకుంటున్నారు. తమ సమస్య తీర్చాలని అధికారులను ప్రాధేయపడుతున్నారు. ఇంతకీ ఆ చిన్నారులు ధర్నా చేసేది.. ఎందుకోసం అంటే రోడ్డు కోసం. అవునూ.. పాఠశాలకు వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేదని.. రహదారి బాగు చేయాలని మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలిపారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కోటపాడు గ్రామంలో విద్యార్థులు వినూత్న నిరసన చేపట్టారు. 'మా గ్రామం రోడ్డు సరిగా లేదు' అంటూ విద్యార్థులు ఫ్ల కార్డులతో మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలిపారు. తమ రోడ్డు బాగాలేదని.. స్కూల్ కి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉందని.. జగనన్న రోడ్డు వేయాలంటూ నినాదాలు చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి తమ ఊరు రోడ్డు భారీ గుంతలు ఏర్పడి.. వర్షాకాలం వస్తే ఆ రోడ్డుపై ప్రయాణించాలన్న చాలా ఇబ్బందిగా ఉందన్నారు. విద్యార్థులు కోటపాడు నుంచి మహిమలూరు పాఠశాలకు వెళ్లాలన్న చాలా ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు. రోడ్డు సమస్య గురించి నియోజకవర్గ ఎమ్మెల్యేకు, అధికారులకు ఎన్నిసార్లు వివరించిన సమస్య పరిష్కారం కావడానికి చర్యలు చేపట్టలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు వేయాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. ప్రస్తుతం విద్యార్థులు నిరసన చేపట్టే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.