Students protest for Hindi Teacher: పరీక్ష పేపర్‌పై పేరు మాత్రమే రాసి.. టీచర్ కోసం విద్యార్థుల వినూత్న నిరసన
Students protest for Hindi Teacher in chowduwada : విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి హిందీ టీచర్ రాలేదు.. ఒక్క పాఠం కూడా చెప్పలేదు.. అయినా హిందీ పరీక్ష నిర్వహించడంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్ష పేపర్‌పై విద్యార్థి పేరు మాత్రమే రాసి.. వారంతా తరగతి గది నుంచి బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. హిందీ టీచర్ని తక్షణమే నియమించాలని అనకాపల్లి జిల్లా కె. కోటపాడు మండలం చౌడువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. చౌడువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాదాపుగా 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఇద్దరు హిందీ టీచర్లు ఉండేవారు.. ప్రస్తుతం ఒకరు మాత్రమే ఉన్నారు. మరొకరు స్కూల్ ప్రారంభమైనప్పటి నుంచి రాలేదు. దీంతో హిందీ పాఠ్యాంశాలు ఎవరూ చెప్పలేదు. ఈ మేరకు బుధవారం పరీక్షల్లో భాగంగా హిందీ పరీక్ష నిర్వహించగా.. విద్యార్థులు అందరూ పేపర్‌పై తమ పేరు మాత్రమే రాసి, పరీక్ష గది నుంచి బయటికి వచ్చి నిరసన తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి హిందీ టీచర్ని రప్పించాలని కోరారు. పలువురు తల్లిదండ్రులు హిందీ పాఠ్యాంశాలు బోధించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.