'అధ్యక్షా!' ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితిపై బాధపడాలా? బెంగపడాలా? సిగ్గుపడాలా? : 'దద్దరిల్లిన అసెంబ్లీ'
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 22, 2023, 6:58 PM IST
Students Perform Mock Assemblyin Kurnool:నేటి బాలలే రేపటి పౌరులుగా మారి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై స్పందిస్తారు. అందుకోసం పిల్లలకు చిన్నప్పటి నుంచి విద్యా బుద్దులతో పాటుగా... సమాజంతో ఎలా నడుచుకోవాలి అనే అంశాలు పాఠశాలల్లో నేర్పిస్తారు. అలా మంచి లక్షణాలు అలవరుచుకున్న పిల్లలు మంచి పౌరులుగా దేశ అభివృద్దిలో భాగస్వాములు అవుతారు. వివిధ రంగాల్లో తమ సేవలు అందిస్తూ దేశాన్ని ముందుకు నడిపించేందుకు కృషి చేస్తారు. అందుకోసమే పిల్లలో రాజకీయాలపై అవగాహన కల్పిస్తూ... సమాజంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆ స్కూల్ విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు... ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడిలా మారి మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ చర్చల్లో రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే అంశాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తూ ఓ వర్గం విద్యార్థులు మాట్లాడగా... ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై మరో వర్గం విద్యార్థులు మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలు అచ్చం అసెంబ్లీని తలపించిన సంఘటన కర్నూలు జిల్లా సెయింట్ జోసెఫ్ పాఠశాలలో నెలకొంది.
విద్యార్థులు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల పైన ఎక్కువ దృష్టి పెడుతున్నారని.. రాజకీయాలపై సైతం విద్యార్థులకు ఉండాలని ఈ మాక్ అసెంబ్లీ నిర్వహించినట్లు సెయింట్ జోసఫ్ పాఠశాల అధ్యాపకులు తెలిపారు. మాక్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంతో పాటు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ఏ విధంగా అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు చేసుకుంటారో విద్యార్థులు అదే తరహాలో ఒకరిపైఒకరు విమర్శలు చేసుకున్నారు. మాక్ అసెంబ్లీలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొనిఉన్న సమస్యలు, రాష్ట్ర దుస్థితిని ప్రతి పక్షపార్టీ నాయకుల పాత్రలో విద్యార్థులు ప్రసంగించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆందోళన చేస్తే అడ్డుకునేందుకు వచ్చే మార్షల్స్ వేషంలో విద్యార్థులు మాక్ అసెంబ్లీలో కనిపించడం విశేషం.