Vasathi Deevena: సీఎం వసతి దీవెన సభలో.. స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థిని
అనంతపురం జిల్లా నార్పలలో నిర్వహించిన సీఎం వసతిదీవెన సభ మధ్యలో నుంచి జనం వెళ్లిపోయారు. ఎవరూ ఎటూ కదలకుండా బారికేడ్లు ఏర్పాటు చేసినా.. సీఎం ప్రసంగిస్తుండగానే చాలామంది బయటికెళ్లారు. నాడు-నేడుతో తరగతి గదులను సరికొత్తగా తీర్చిదిద్దుతున్నామని సీఎం తెలిపారు. డిజిటల్ బోధన, పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ సహా వివిధ రకాల కార్యక్రమాలతో విద్యావ్యవస్థలో మార్పులు తెస్తున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే బారికేడ్ల మధ్య నుంచి వెళ్లేందుకు యత్నించిన పూజిత అనే విద్యార్థిని స్పృహ కోల్పోయింది. అస్వస్థతకు గురైన పూజితను తోటి విద్యార్థులు సభా ప్రాంగణానికి సమీపంలోనే ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి తీసుకెళ్లారు. అక్కడ విద్యార్థినికి ప్రాథమిక చికిత్స అందించారు. ఎండ వేడిని దృష్టిలో ఉంచుకొని కార్యక్రమం నిర్వహించాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఇంత వేడిలో ఎలా ఉండగలమంటూ ప్రశ్నించారు. గతంలో సైతం సీఎం జగన్ సభకు వచ్చిన జనం సమావేశం మధ్యలో వెళ్లేందుకు ప్రయత్నించారు.. అప్పడు సైతం పలువురికి గాయాలయ్యాయి.