MINISTER RAJANNA DORA INSPECTED HOSTEL: "విద్యార్థి హత్య కేసులో నిందితులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు" - పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సిటీ
MINISTER RAJANNA DORA INSPECTED HOSTEL: వసతి గృహం విద్యార్థి హత్య కేసులో నిందితులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని.. ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం పులిరాముడుగూడెంలో పర్యటించిన ఆయన.. ఆశ్రమ పాఠశాల, వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి నిన్న హత్యకు గురైన నాలుగో తరగతి విద్యార్థి.. అఖిల్ మృతికి సంబంధించిన పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అఖిల్ తల్లిదండ్రులను ఆయన పరామర్శించారు. అనంతరం అఖిల్ తల్లిదండ్రులు, ఎమ్మెల్యే బాలరాజు, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, అధికారులతో సమావేశమై దర్యాప్తునకు సంబంధించిన విషయాలపై మంత్రి ఆరా తీశారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల చెక్కును బాలుడి తల్లిదండ్రులకు మంత్రి అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ఇక్కడ చదువుతున్న పిల్లలు, వారి తల్లిదండ్రులు, గ్రామస్థులు ఎవరు భయపడవలసిన పనిలేదు. అన్ని విధాలుగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని భరోసా కల్పించారు. నేరస్థులు ఎవరైనా తప్పించకోలేరు అని తెలిపారు. హాస్టల్ కి సీసీ కెమెరాలు, చుట్టుపక్కల వీధి దీపాలు ఏర్పాటు చేస్తామన్నారు. పిల్లల బాగోగులు చూసుకోవల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని మంత్రి వ్యాఖ్యానించారు. ఏ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఊరుకునే ప్రసక్తి లేదని రాజన్న దొర హెచ్చరించారు.