Different Snakes: ఉప్పుటేరులో వింత పాములు.. ఒకటీ రెండూ కాదు ఏకంగా - Different snacks in upputeru
Different snacks in Poodimadaka upputeru: అనకాపల్లి జిల్లా పూడిమడక ఉప్పుటేరులో వింత పాములు ప్రత్యక్షమయ్యాయి. నీటిలో నుంచి బయటికి తీస్తే పాలు లాంటి నీరు కారుతూ చనిపోతున్నాయి. ఇటువంటి పాములను మేము ఎప్పుడూ చూడలేదని మత్స్యకారులు అంటున్నారు. చెరువులో వందలకొద్ది ఉన్న ఈ పాములను చూసి మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
సిసిలియన్ల జాతికి చెందినవిగా గుర్తింపు..మత్స్యకార నాయకుడు మేరుగు ప్రవీణ్‌కుమార్ వీటి ఫొటోలు, వీడియోలు మత్స్యశాఖ అధికారులు పంపించగా.. ఇక్కడి అధికారులు వీటిపై ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం జిల్లా మత్స్య అభివృద్ధి అధికారి లక్ష్మణరావు మాట్లాడుతూ.. వీటిని సిసిలియన్ల జాతికి చెందినవిగా గుర్తించామని తెలిపారు. నీటిలోనూ, మెత్తటి భూమిపైనా జీవించే ఇవి ఉష్ణ మండల సముద్రతీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయని అన్నారు. వీటికి తలా, తోక ఎటువైపు ఉన్నాయో? తెలుసుకోవడం కష్టమైన పని.. ఇవి ఆహారంగా తీసుకోవడానికి పనికిరావని.. నదులు, సముద్రాలు కలిచేచోట నేల వదులుగా ఉండే ప్రాంతాల్లో ఆకుచెత్త, చిన్నచిన్న కప్పలు, పురుగులను ఆహారంగా తీసుకుంటాయని వివరించారు. ఈ పాముల నోట్లో పదుల కొద్ది పదునైన దంతాలు ఉంటాయని వాటిద్వారా వేటాడతాయని అన్నారు. ఈ పాములు వేరే జంతువుల నుంచి కాపాడుకోవడానికి వీటి చర్మానికి ఉన్న గ్రంధుల నుంచి విషాన్నిబయటకు విడుదల చేసి కాపాడుకుంటాయని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 120 రకాలైన సిసిలియన్లు రకాలు ఉన్నాయని వివరించారు.