విశాఖ ఉక్కు పోరాటానికి వెయ్యి రోజులు - ప్రభుత్వ స్పందన లేకపోవడంపై మండిపడుతున్న కార్మిక సంఘాలు - విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యమం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 10:15 PM IST
Steel Plant Leaders Fires on YCP Govt: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వెయ్యి రోజులు నుంచి కార్మికులు పోరాటం చేస్తున్నా.. రాష్ట్రం ప్రభుత్వం స్పందించకపోవడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. మిగిలిన రాష్ట్రాలు.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ఊసెత్తితే భగ్గుమంటున్నాయి. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం గట్టిగా ఒక్క మాట మాట్లాడకపోవడంపై కార్మిక సంఘాలు ఆగ్రహిస్తున్నాయి.
ఉత్తరాంధ్రలో సామాజిక సాధికారత బస్సు యాత్ర చేస్తున్న వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు.. స్టీల్ ప్లాంట్ గురించి కనీసం మాట్లాడకపోవడం దారుణమని అంటున్నారు. ఇప్పటికే ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలు.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ జోలికి వెళ్తే కేంద్రాన్ని గట్టిగా నిలదీశాయని కానీ ఆంధ్రాలో మాత్రం లేఖలు రాశామని చేతులు దులుపుకోవడం సిగ్గు చేటు అని అన్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ ఇచ్చి కాపాడిన విశ్వాసం కూడా లేకుండా స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేస్తుంటే స్థానిక నేతలు, ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు స్పందన లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 8వ తేదీతో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం మొదలు పెట్టి 1000 రోజులు అవుతోందని.. దేశ వ్యాప్త నిరసనలతో ఉద్యమాన్ని ఉత్తేజ పరుస్తామని కార్మిక సంఘ నేతలు చెప్తున్నారు.