CM Vishaka tour విశాఖలో సీఎం పర్యటన.. ఉక్కు ఉద్యోగుల రాస్తారోకో.. ఉద్రిక్తతల నడుమ పలువురు అరెస్ట్ - ఉక్కు ఉద్యమ కార్యాచరణ సమితి
Steel Plant Employees Arrest: విశాఖపట్నంలో సీఎం జగన్ పర్యటించనున్న సంగతి తెలిసిందే. విజయనగరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన అనంతరం విశాఖ రానున్నారు. విశాఖ ఐటీ సెజ్‌లో అదానీ డేటా సెంటర్, ఐటీ పార్క్, రిక్రియేషన్ సెంటర్, స్కిల్ వర్సిటీలకూ సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. అయితే సీఎం జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో ఉక్కు ఉద్యోగులు రాస్తారోకో చేపట్టారు. ఉక్కు ఉద్యమ కార్యాచరణ సమితి పిలుపు మేరకు.. కూర్మన్నపాలెం, పాత గాజువాక, అగనంపూడి ప్రధాన రహదారులు, మండల కేంద్రాల్లో కార్మికులు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. కూర్మన్నపాలెం జాతీయ రహదారిని ఉక్కు పోరాట కమిటీ దిగ్బంధించింది. దీంతో కమిటీ నాయకులు రామచంద్రరావు, ఆదినారాయణ, అయోధ్యరామ్, తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. సీఎం పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టారు.
మరోవైపు సీఎం జగన్ చేసిన మోసానికి నిరసనగా, జై భీమ్ భారత్ పార్టీ నుంచి నల్ల జెండాలతో స్వాగతం పలికి, 'గడప గడపకు దగా ప్రభుత్వం' పుస్తకం ఇవ్వటానికి విశాఖ నార్త్ కన్వీనర్ కారం మమత, రాష్ట్ర ప్రతినిధి కారెం వినయ్ ప్రకాష్ సిద్ధమైయ్యారు. ఈ నేపథ్యంలో వారిని ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. అలాగే పాత గాజువాక సెంటర్లో రాస్తారోకో చేస్తున్న ఎమ్మెల్యే నాగిరెడ్డిని మినహాయించి తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వామపక్ష నేత నరసింహరావు, కొంతమంది వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.