Minister Peddireddy Comments : రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు : మంత్రి పెద్దిరెడ్డి
Minister Peddireddy Ramachandra Reddy Comments : ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన వైఎస్సార్సీపీ లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. లోక్ సభ, శాసనసభ ఎన్నికలు రెండూ కలిసే వస్తాయని విజయవాడలో ఆయన అన్నారు. తమ పార్టీ బలంగా ఉందని.. వేరే పార్టీల గురించి తమకు అనవసరం లేదని చెప్పారు. ఒంటరిగా పోటీ చేస్తామా.. లేక పొత్తులు పెట్టుకుంటామా అన్న విషయాలు అప్రస్తుతం, అనవసరం అని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి వెళ్లి దేహీ అని ఎందుకు అడుగుతున్నాడు అని ప్రశ్నించారు. వేరే రాజకీయ పార్టీలపై టీడీపీ ఆధారపడుతోందని, వారి అండ కోసం తాపత్రయపడుతోందని పేర్కొన్నారు. వామపక్షాలు, బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు ఎదురు చూస్తున్నారని తెలిపారు. మేం ఒంటరిగా పోటీ చేస్తాం, మాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు.. దేవుడి దయ, ప్రజల అభిమానం ఉంటే చాలు అని మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 14 నుంచి వారాహి ద్వారా ప్రజల్లోకి రాబోతున్నారు.. దీనిపై మీరేమంటారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. పవన్ కళ్యాణ్ గురించి తాను ఏమీ మాట్లాడలేనని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.