సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం - ₹552 కోట్ల రుణ సేకరణకు అనుమతి - State Cabinet approvals updates
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 15, 2023, 4:37 PM IST
State Cabinet Updates: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 11 వైద్య కళాశాలల్లో విభాగాల ఏర్పాటు, 287 పోస్టుల భర్తీ, వృద్ధాప్య పింఛన్ల పెంపు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
Cabinet Approves Loan Collection of Rs.552 Crores: 11 వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతోపాటు నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల్లో ఖాళీగా ఉన్న 287 పోస్టుల భర్తీకి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం కళాశాలల్లో అంకాలజీ విభాగం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటితోపాటు వృద్ధాప్య పింఛన్లు రూ.3 వేల పెంపు ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. విశాఖలోని 4 కారిడార్లలో లైట్ మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌కు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర సీసీటీవీ సర్వైలెన్స్ ప్రాజెక్టుతోపాటు, జిల్లాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ.552 కోట్ల రుణ సేకరణకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. రుణ సేకరణకు ఏపీఎఫ్‌ఎస్ఎల్‌కు అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదం తెలిపింది. మధురవాడలో ఓ ప్రైవేటు విద్యాసంస్థలకు 11 ఎకరాలు, భీమిలిలో ముత్తంశెట్టి సతీమణి పేరిట 0.32 సెంట్ల భూమికి కేబినెట్ ఆమోదం తెలిపింది.