Srivari Salakatla Brahmotsavalu శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అపశృతి.. అర్చకుల చేతి నుంచి జారిన శ్వేతఛత్రాలు... - శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వివరాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 23, 2023, 8:31 PM IST
Srivari Salakatla Brahmotsavalu: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో పరిమళ భరిత పూలమాలలు, విశేష తిరువాణాభరణాలతో అలంకృతులైన స్వామివారు.. మాడవీధులలో విహరిస్తూ... భక్తులకు అభయప్రదానం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, కోలాటాలు, డప్పునృత్యాలు ఆకట్టుకున్నాయి. స్వామి వారిని దర్శించునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
అయితే, ఈ వేడుకలలో చిన్న అపశృతి చోటుచేసుకుంది. ఆరో రోజు బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavams) భాగంగా ఉదయం మలయప్ప స్వామి నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. నాలుగు మాడ వీధుల వరకు వాహన సేవ సజావుగా సాగింది. వాహన మండపానికి వేంచేపు చేసే సమయంలో వాహనసేవలో ఉపయోగించే శ్వేతఛత్రాలు పక్కకు వాలిపోయాయి. ఈ ఘటన వాహనమండపం వైపు వెనక్కు వెళుతుండగా జరిగింది. వాహన బేరర్లు వేగంగా వెళ్లడంతో వాహనంపై ఉన్న అర్చకుల చేతి నుంచి ఛత్రాలు జారింది. వెంటనే స్పందించిన అర్చకులు వాలిన శ్వేత ఛత్రాలను సరిచేసి వాహనాన్ని మండపానికి చేర్చారు.