తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు
TIRUMALA BRAHMOTSAVALU 2022 : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారు సర్వభూపాల వాహనంపై ఆలయ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారని భక్తుల నమ్మకం..
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST