Srisailam Maha Kumbhabhishekam శ్రీశైలంలో మహా కుంభాభిషేకం ఎప్పటి నుంచి అంటే..? - ఏపీలో ముందస్తు ఎన్నికలు
Srisailam Maha Kumbhabhishekam: శ్రీశైలంలో జరగాల్సిన మహా కుంభాభిషేకాన్ని నవంబర్‌లో నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. కుంభాభిషేకం ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతుల సమక్షంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఇతర అధికారులతో చర్చించినట్టు మంత్రి తెలిపారు. హైకోర్టు సూచించిన ప్రకారం ప్రవచనకర్తలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, షణ్ముఖశర్మ సూచించే తేదీలను ఖరారు చేస్తామన్నారు. కుంభాభిషేకానికి సెప్టెంబర్ నుంచి పనులు మొదలు పెట్టాలని ఈవోను మంత్రి ఆదేశించారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లవలసిన అవసరం మాకు లేదు:ముందస్తు ఎన్నికలకు వెళ్లవలసిన అవసరం తమకు లేదని.. ఇచ్చిన హామీలు అన్నీ అమలుచేస్తున్నామని అన్నారు. ప్రజలంతా మళ్లీ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ప్రభుత్వానికే ఓటు వేస్తారని.. షెడ్యూల్ ప్రకారమే తమ పార్టీ ఎన్నికలకు వెళ్తుందని కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎన్నికల్లో హామీ ఇవ్వనప్పటికీ కాపు నేస్తం ద్వారా లక్షల మంది మహిళలు, కుటుంబాలకు లబ్ధి కలిగిస్తున్నట్లు మంత్రి తెలిపారు.