కనుల పండువగా అప్పన్న కల్యాణ మహోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు - సింహాచలం లేటెస్ట్ న్యూస్
Narasimha Swamy Kalyanam: విశాఖ జిల్లా సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి 9:30 గంటలకు వైభవంగా జరిగింది. సింహగిరిపై ఉన్న నరసింహ స్వామి కల్యాణ మండపంలో భారీ ఎత్తున వేదిక ఏర్పాటు చేసి పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం వైదికులు కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి, గోవిందరాజస్వామిల ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలకరించి వేదికపై అధిష్టింపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణ వేడుకను ఘనంగా జరిపారు. భక్తులకు ముత్యాల తలంబ్రాలను అందజేశారు. స్వామివారి కల్యాణ మహోత్సవానికి ముందు రథోత్సవం ఘనంగా జరిగింది. వంశ పారంపర్య అనువంశిక ధర్మ కర్త పూసపటి అశోక్ గజపతి రాజు రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్త జనాలు భారీ ఎత్తున తరలివచ్చారు. కాగా.. అప్పన్నస్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని శనివారం గాజువాక ప్రాంతానికి చెందిన దాతలు రూ. 7,52,300 విలువ చేసే బంగారు మంగళసూత్రాలను, గొలుసును బహూకరించారు. శనివారం రాత్రి సింహగిరిపై అర్చకులు మృత్సంగ్రహణంతో కల్యాణ మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపివేశారు. నృసింహస్వామికి విశేష పూజలు నిర్వహించి ఉత్సవానికి అంగీకరించాలని కోరుతూ ఉత్సవాంగీకారము జరిపారు. అనంతరం తిరిగి రాత్రి 8.30 గంటల నుంచి 10 గంటల వరకు భక్తులకు దర్శనాలు కల్పించారు.