సుశ్శమీంద్ర తీర్థ ఆరాధన మహోత్సవాలు.. రాఘవేంద్ర మఠంలో భక్తి పారవశ్యం - రాఘవేంద్ర మఠం వివరాలు
Sri Sushameendra Tirtha Aradhanotsavam: కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పూర్వ పీఠాధిపతులు శ్రీ సుశ్శమీంద్ర తీర్థుల ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో ఆరాధన మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో వీరబ్రహ్మేంద్ర దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ పూజారులు... పూర్వ పీఠాధిపతులు శ్రీ సుశ్శమీంద్ర తీర్థుల మూల బృందావనాలకు పట్టు వస్త్రాలను అలంకరించారు. చిత్రపటాన్ని నవరత్నాల రథోత్సవంపై ఉంచి మంగళ హారతులు ఇచ్చి వైభవంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. స్వామి వారి సేవలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తి శ్రద్ధలతో సుశ్శమీంద్ర తీర్థుల ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసులు, ఆలయ అధికారులు సమన్వయంతో కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకున్నారు.