Rathostavam: రాయదుర్గంలో శ్రీవారి బ్రహ్మరథోత్సవం.. భక్తజన తరంగం - శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
Sri Prasanna Venkateshwara Rathotsavam: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సుప్రసిద్ధ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీవారి రథోత్సవం వైభవంగా సాగింది. రథోత్సవం సందర్భంగా ఆలయంలో శ్రీ వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో శ్రీవారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి రథం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. ఉదయం సుప్రభాత సేవ, పవిత్ర జలాలతో గంగా పూజ, పంచామృతాభిషేకం, పుష్పాలంకరణ, మహా మంగళహారతి వంటి విశేష పూజలు నిర్వహించారు. వేద బ్రాహ్మణులు వినాయక పూజ, శాంతి హోమములు నిర్వహించారు.
సాయంత్రం నాలుగు గంటలకు వేద పండితులు ప్రత్యేక పూజల అనంతరం వినాయక సర్కిల్ నుంచి బళ్లారి రోడ్ లోని శాంతినగర్ వరకు భక్తజన సందోహం నడుమ శ్రీవారి రథాన్ని ఊరేగించారు. భక్తుల హరినామ స్మరణలతో శ్రీదేవి, భూదేవి సమేతులైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి రథంలో ఊరేగారు. రాయదుర్గం ప్రాంతం గోవింద, నారాయణ, శ్రీ వెంకటేశ్వర నామస్మరణతో మారుమోగింది. స్థానిక భక్తులతో పాటు ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి శ్రీవారి రథోత్సవం లో పాల్గొన్నారు. రాయదుర్గం దేవదాయ శాఖ అధికారులు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.