చరిత్రను తిరగ రాసేందుకు మరొక శ్రీకృష్ణదేవరాయలు వస్తున్నాడు - సినీ నటుడు పృథ్విరాజ్ - జగన్ పై సినీ నటుడు పృథ్విరాజ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 24, 2023, 8:06 PM IST
|Updated : Dec 24, 2023, 10:40 PM IST
Sri Krishnadevaraya Bronze Statue Inauguration: శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు పృథ్విరాజ్ హాజరయ్యారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం మండల కేంద్రంలో బలిజ సంఘం నాయకుల ఆధ్వర్యంలో 500 కేజీల కాంస్య విగ్రహాన్ని తేరు కూడలిలో ఏర్పాటు చేశారు. ఎటువంటి సమస్యలు లేకుండా పరిపాలన కొనసాగించిన రాజ్యం ఏదైనా ఉందంటే అది శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే జరిగిందని ఈ విగ్రహావిష్కరణలో పాల్గొన్న సినీ హాస్యనటుడు పృథ్వీరాజ్ అన్నారు.
శ్రీ కృష్ణదేవరాయల చరిత్ర ప్రజలందరికీ తెలుసని, ఆ చరిత్రను తిరగ రాసేందుకు మరొక శ్రీకృష్ణదేవరాయలు వస్తున్నాడని, ఆ విషయం మీకు తెలుసు అని తెలిపారు. ప్రస్తుతం చాలా మంది ఏం జరిగినా సరే కులాన్ని ముందుకు తెస్తున్నారని, ఎవరెన్ని చేసినా బలిజ సోదరులు మౌనంగానే ఉంటారని పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు బలిజ సోదరుల దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తారని పృథ్వీరాజ్ అన్నారు. త్వరలోనే బలిజ సోదరుల తీర్పు ఎలా ఉండబోతుందో చూస్తారని తెలిపారు.
Comedian Prudhvi Raj Comments on YSRCP: వైసీపీ ప్రభుత్వంపై పృథ్వీరాజ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక్క ఛాన్స్ అంటే నమ్మి వైసీపీకు అధికారం ఇచ్చారని, జగన్ అద్భుతాలు చేస్తాడనుకున్నారు కానీ ఏమీ చేయరని అర్థమైందన్నారు. రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పే పరిస్థితిలో మంత్రులు లేరని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వంలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరేం లేదన్న పృథ్వీరాజ్, మంత్రుల కంటే సలహాదారుల పాత్ర ఎక్కువైందని అన్నారు.