ఆంధ్ర సరిహద్దులో వైభవంగా శ్రీ గురు బసవేశ్వర స్వామి రథోత్సవం - స్వామివారి రథోత్సవం
Sri Guru Basaveshwara Swamy Rathostavam: శ్రీ గురు బసవేశ్వర స్వామి రథోత్సవం భక్తజన కోటితో రంగరంగ వైభవంగా జరిగింది. ఇది మన రాష్ట్రంలో ఉందనుకుంటే మీరు పోరపాటు పడినట్టే. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం ఆంధ్ర సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం హోస్పేట, విజయనగరం జిల్లా కొట్టూరు తాలూకా కేంద్రంలో గురువారం సాయంత్రం భక్త జన సందోహం నడుమ శ్రీ గురు బసవేశ్వర స్వామి రథ ఉత్సవం అత్యంత వైభవంగా సాగింది. లక్షలాది మంది భక్తులు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తరలివచ్చి స్వామి వారి ఉత్సవాల్లో పాల్గొన్ని వారి కోరికలను స్వామి వారికి తెలియజేశారు.
హిందూ ధార్మిక సంస్థ, ధర్మదాయ, దేవదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ గురు బసవేశ్వర స్వామి జాతర ఈ నెల 12వ తేదీ నుంచి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అశేష జన వాహిన నడుమ ప్రారంభమైన రథ ఉత్సవం బస్టాండ్ ప్రాంతం నుంచి ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వరకు భక్తులు లాగారు. శివనామ స్మరణతో ఆ ప్రాంతమంతా భక్తజన కోటితో నిండిపోయింది. ప్రతి ఏటా మాఘ మాసంలో నిర్వహించే జాతరకు ఉత్తర, దక్షిణా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన కొట్టూరు తరలివచ్చి స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నారు. కర్ణాటక రాష్టం విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో రథోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఉండటానికి పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.