Sravana Masam Special Pujas Started at Simhachalam: శ్రావణమాసం వేళ.. సింహాచలంలో ప్రత్యేక పూజలు - heavy rush in simhachalam temple
Sravana Masam Special Pujas at Simhachalam: విశాఖపట్నం జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా శ్రావణ మాస పూజలు ప్రారంభమయ్యాయి. ఐదు వారాల పాటు ఈ ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా కుంకుమ పూజ నిర్వహిస్తారు. దీనిలో భాగంగా శుక్రవారం (ఆగస్టు 18)న అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోత్ర నామాలతో పూజాదికాలు నిర్వహించారు. అలానే శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి నిత్య కల్యాణం నేత్ర పర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నూతన యజ్ఞోపవీత సమర్పణ, కంకణధారణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను వైభవంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళశాసనాల తరవాత భక్తులకు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం శేష వస్త్రాలను, స్వామివారి ప్రసాదాలను భక్తులకు వేద పండితులు అందజేశారు.