Dashabhuja Ganapati temple ఇక్కడి వినాయకుడ్ని పూజిస్తే.. 41రోజుల్లో కోరిన కోర్కెలు తీరుతాయట!
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 19, 2023, 5:53 PM IST
Special poojas in Dashabhuja Ganapati temple : అనంతపురం జిల్లా రాయదుర్గంలో శ్రీ దశభుజ గణపతి ఆలయంలో వినాయక చవతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా గణనాథున్ని 15 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు, పది భుజాలతో ఉన్న విగ్రహాన్ని ఏక శిలతో మలిచారు. భక్తులు కోరుకున్న కోర్కెలను తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతున్నాడని స్థానికులు అంటున్నారు. భక్తులు ఆలయంలో స్వామివారి వద్ద పూర్ణ నారికేళాలు సమర్పించి.. వారి కోర్కెలు తీర్చమని వేడుకుంటారు. 41 రోజులలో కోరుకున్న కోర్కెలు తీరుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. 14 శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో నిర్మించిన పురాతన ఆలయాల్లో దశభుజ గణపతి ఆలయం ప్రసిద్ధి చెందింది.
వినాయక చవితి సందర్భంగా.. ఆలయ ప్రధాన అర్చకులు దశభుజ గణపతి మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో గంగపూజ, పంచామృత, రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం చెరుకుగడలు, మారేడు దళములు, గరికలతో స్వామి వారిని అలకరించారు. స్వామి వారిని దర్శించుకోవటానకి స్థానికులతో పాటు ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. రాయదుర్గం దేవాదాయశాఖ అధికారులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయంలో భక్తులకు తీర్థ ప్రసాదములు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించారు.