రామయ్య కల్యాణానికి కోటి తలంబ్రాలు.. రాజమహేంద్రవరంలో పూజలు - KOTI TALAMBRALU for BHADRADRi
Koti Goti Talambralu: భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఏటా సమర్పించే గోటితో తీసిన కోటి తలంబ్రాలకు రాజమహేంద్రవరంలో పూజలు నిర్వహించారు. పుష్కర్ ఘాట్ వద్ద రామ అష్టోత్తర శతనామావళి, రామ గాయత్రి మంత్ర హోమం నిర్వహించారు. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 12వ కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి.. భద్రాచలంలో పూజచేసిన వడ్లను తీసుకొచ్చి వాటిని గోకవరం మండలంలోని అచ్యుతాపురంలో పండించారు. అలా పండిన ధాన్యాన్ని గోటితో తీసి.. ఆ తలంబ్రాలను భద్రాచలం సీతారాముల కల్యాణమహోత్సవానికి సమర్పించనున్నారు. శ్రీరామ నామస్మరణతో గోటితో వడ్లను వలవడం ద్వారా దివ్యమైన, సున్నితమైన వైఖరి నెలకొని త్వరితగతిన రామతత్వాన్ని పొందుతారని నిర్వాహకుడు తెలిపారు.
నాలుగు రాష్ట్రాలకు చెందిన 3 వేల మంది భక్తులు కోటి తలంబ్రాలు తీసినట్టు నిర్వాహకుడు కళ్యాణం అప్పారావు చెప్పారు. ఈ నెల 26వ తేదీన భద్రాద్రి ఆలయంలో తలంబ్రాలు అందించనున్నట్టు చెప్పారు. అలాగే ఒంటిమిట్ట కల్యాణరాముడి.. కల్యాణానికి ఏప్రిల్ 4వ తేదీన కోటి గోటి తలంబ్రాలు అందిస్తామని అప్పారావు చెప్పారు. రామతత్వం ప్రచారంలో భాగంగా కోటి గోటి తలంబ్రాల యజ్ఞం కొనసాగిస్తున్నట్లు నిర్వాహకుడు కళ్యాణం అప్పారావు తెలిపారు.