Clash between YSRCP factions: అధికార పార్టీలో రెండువర్గాల అలజడి.. కర్రలు, రాడ్లతో దాడులు.. బెంబేలెత్తిన జనం - Annamaya district ycp leadres news
Clash between YSRCP factions in Rayachoti: అధికార పార్టీ (వైఎస్సార్సీపీ)కి చెందిన రెండు వర్గాల నేతలు కర్రలు, రాడ్లతో దాడులు చేసుకున్న సంఘటన అన్నమయ్య జిల్లాలో కలకలం రేపింది. నడిరోడ్డుపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ.. బీభత్సం సృష్టించారు. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ఇరువర్గాలు దాడులు చేసుకుంటున్న సమయంలో రోడ్డుపై వెళ్తున్న స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఇరువర్గాలను సముదాయించేందుకు ప్రయత్నించిన.. అధికారుల ఎదుటే కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌గా మారింది.
స్థలం వివాదం-కర్రలు, రాడ్లతో బీభత్సం..అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో వైఎస్సార్సీపీకి చెందిన రెండు వర్గాల నేతల మధ్య ఓ స్థలం వివాదంలో ఘర్షణ జరిగింది. తమ స్థలంలోకి ఎందుకొచ్చారంటూ.. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. గతకొన్ని రోజులుగా రాయచోటి-మదనపల్లె జాతీయ రహదారిపై ఉన్న స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి, వైసీపీ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి.. భారీ అనుచరగణంతో వేర్వేరుగా వివాదాస్పద స్థలంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఇది కాస్తా.. పెరిగి పెద్దదై పరస్పర ఘర్షణలకు దారితీసింది. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ఇరువురు నేతల ముఖ్య అనుచరులు.. కర్రలు, రాడ్లతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు.
ఇరువురు భార్యల మధ్య వివాదం.. ఈ దాడుల్లో ఇరువర్గాలకు చెందిన నలుగురు గాయపడ్డారు. హోంగార్డుగా పని చేసి మృతి చెందిన మల్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన స్థలం విషయంలో ఆయన ఇరువురు భార్యల మధ్య వివాదం నడుస్తోంది. ఈ పంచాయితీలోకి చొరబడ్డ వైఎస్సార్సీపీ నాయకులు.. స్థలాన్ని స్వాధీనపర్చుకునేందుకు యత్నించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దాడులు జరిగాయని.. స్థానికులు తెలియజేశారు.