SP Gangadhar Rao on CBN Case: చంద్రబాబు అకస్మాత్తుగా రూట్ మార్చుకున్నారు: ఎస్పీ గంగాధర్‌రావు
SP Gangadhar Rao Press Meet On CBN Case: అన్నమయ్య జిల్లా అంగళ్లులో ఇటీవల జరిగిన ఘర్షణలకు సంబంధించి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై.. హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశామని ఎస్పీ గంగాధర్‌రావు వెల్లడించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముదివీడు పోలీసు స్టేషన్‌లో.. చంద్రబాబు సహా మరో 20 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశామని ఆయన అన్నారు. ముదివీడు పోలీసులు కేసులు పెట్టిన వారిలో.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, నల్లారి కిషోర్, దమ్మాలపాటి రమేష్, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని ఉన్నారు. ఇంకా చాలామంది స్థానిక నాయకులపై కూడా.. ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
ఈ నెల నాలుగో తేదీన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలుత మదనపల్లె సమ్మర్ వాటర్ స్టోరేజ్ గ్రిడ్ పరిశీలనకు అనుమతి తీసుకున్నారని ఎస్పీ తెలిపారు. అనంతపురం జిల్లాలో నుంచి అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించే సమయంలోనే రూట్ మార్చి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారన్నారు. నాయనవారి చెరువు వద్ద స్థానిక ఎమ్మెల్యేను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడారన్నారు. అయితే ముదివేడు పరిధిలోని పిచ్చిలవండ్లపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు గతంలో చంద్రబాబు కోర్టు కేసులు వేయించారని.. మళ్లీ ప్రాజెక్టు సందర్శించి అడ్డంకులు సృష్టించవద్దని అంగళ్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతి రెడ్డి.. మరి కొంతమంది వైకాపా కార్యకర్తలు చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు అంగళ్లలో రోడ్డుపైకి వచ్చారన్నారు. అప్పటికే ముందస్తు ప్రణాళికతో భారీగా చేరుకున్న తెదేపా కార్యకర్తలు.. వైసీపీ కార్యకర్తలపై రాళ్లు, కట్టెలు, చెప్పులు, కర్రలతో దాడి చేశారన్నారు. ఈ దాడిలో వైసీపీకి చెందిన అర్జున్ రెడ్డి, ఎంపీటీసీ మహేష్, జడ్పీటీసీ చంద్రశేఖర్, రిపోర్టర్ శ్రీనివాసులుతో పాటు మరో రైతు తీవ్రంగా గాయపడ్డారని ఆయన పేర్కొన్నారు.
దాడి చేయడం, కార్యకర్తలను రెచ్చగొట్టడం వంటి నేర తీవ్రత కలిగిన అంశాలపై 120 బి, 147, 145, 153, 307, 115, 109, 323, 324, 506 రెడ్ విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఎస్పీ వివరించారు ఈ సంఘటనలకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుందని.. ఫిర్యాదులను కూడా పరిశీలించి విచారిస్తామని ఎస్పీ వెల్లడించారు.