Sons Put their Father at Bus Shelter: ఆస్తి పంచలేదని కన్నతండ్రిపై కర్కశం.. బస్సు షెల్టర్ వద్ద వదిలేసిన కుమారులు - నెల్లూరు జిల్లా లేటెస్ట్ న్యూస్
Sons Put their Father at Bus Shelter: ఆస్తి పంచలేదని వృద్ధ తండ్రిని నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేశారు ఆయన కుమారులు. నడవలేక.. కదలలేని స్థితిలో బస్సు షెల్టర్ వద్ద అనాథలా పడిఉన్న వృద్ధుడి అవస్థలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మర్రిపాడు మండలంలోని నెర్ధనంపాడుకు చెందిన ఇర్లపెద్ద అంకయ్య అనే వృద్ధుడికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కూలీనాలీ చేసి వారందరినీ పెంచి పోషించి పెళ్లిళ్లు చేశాడు. కుమార్తెలు అత్తారింటికి వెళ్లి పోగా, పెద్ద కుమారుడు పెద్ద శీనయ్య ఆత్మకూరులోనూ, చిన్న కుమారుడు చిన్న శీనయ్య వింజుమూరు మండలంలో స్థిరపడ్డారు. వృద్ధాప్యంలోకి వచ్చిన అంకయ్య రెండేళ్లపాటు పెద్ద కుమార్తె వద్ద ఉన్నాడు. ఆ తర్వాత గ్రామం పంచాయతీలో పెద్ద మనుషులు.. అంకయ్య ఒక్కో కుమారుడి వద్ద.. ఒక్కో నెల రోజులు ఉండేలా ఒప్పించారు. ఆయన ఒక్కో కొడుకు వద్ద ఒక్కో నెల రోజుల పాటు ఉన్నారు. ఈ క్రమంలో తండ్రి పేరిట ఉన్న ఇంటి స్థలం, రెండున్నర ఎకరాల పొలాన్ని పంచమని ఆయన కుమారులు అడిగారు. అందుకు అంగీకరించలేదని ఆయనను తీసుకొచ్చి స్వగ్రామంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న బస్సు షెల్టర్ వద్ద నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్లిపోయారు. కదలలేని స్థితిలో అనాథలా పడిఉన్న వృద్ధుడి పరిస్థితి చూపరులను కంటతడి పెట్టిస్తోంది.
దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు పండ్లను, తినుబండారాలను ఆ వృద్ధుడి చేతులో పెడుతున్నారు. మరికొంతమంది స్థానికులు ఆయనకు భోజనం పెడుతున్నారు. లేచి నడవలేని స్థితిలో అవస్థలు పడుతున్న వృద్ధుడిని గమనించిన కొంతమంది కుమారులకు ఫోన్ చేసి ప్రశ్నించారు. తమ తండ్రి పేరిట ఉన్న ఇంటి స్థలం, రెండున్నర ఎకరాల పొలాన్ని పంచనని చెప్పడంతో ఆయనను రోడ్డున పడేసినట్లు బంధువులు తెలిపారు. స్థానికులు కొందరు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అంకయ్యకు చెందిన పొలానికి సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకుని వచ్చి ఆయనకు అప్పగించారు. అంతేకాకుండా ఆయనను అనాథ శరణాలయానికి తరలించేందుకు సిద్ధమవుతున్నారు. కనీ.. పెంచిన తండ్రిని ఆస్తి కోసం రోడ్డున పడేసిన కొడుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.