Somireddy Protest at Police Station: టీడీపీ నేత అక్రమ అరెస్ట్.. పోలిస్టేషన్ ఎదుటే రాత్రంతా ఉన్న మాజీ మంత్రి - AP Latest News
Subbareddy protested in front of police station: నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అరాచకాలకు అంతులేకుండా పోయిందని.. తెలుగుదేశం నేత సోమిరెడ్డి మండిపడ్డారు. వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాలెం తెలుగుదేశం నాయకుడు ఈపూరు సుబ్బారెడ్డిని అక్రమంగా అరెస్టు చేయించారని ధ్వజమెత్తారు. సుబ్బారెడ్డిని విడిచిపెట్టే వరకు స్టేషన్ వద్ద నుండి కదలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలీసులపై విరుచుకుపడ్డారు. స్టేషన్ వద్దకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి టీడీపీ నాయకులు భారీగా వచ్చి బైఠాయించారు. సచివాలయం ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అక్రమ కేసు బనాయించారని టీడీపీ నాయకులు పోలీసులను నిలదీశారు. అకారణగా నిరాధారమైన సెక్షన్లతో పోలీసులు సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేశారని సోమిరెడ్డి పోలీసులను ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, సెక్షన్ 3 స్పెషల్ యాక్ట్ క్రింద సుబ్బారెడ్డిపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. సొంత నిధులతో గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తే దుర్మార్గంగా అరెస్టు చేస్తారా అని సోమిరెడ్డి పోలీసులను నిలదీశారు. సుబ్బారెడ్డిని విడుదల చేయాలంటూ అర్ధరాత్రి వరకు నిరసన తెలిపారు. కోర్టులో హాజరు పరుస్తామని చెప్పడంతో నిరసన విరమించారు.