Somireddy Chandramohan Reddy Fire on police: 'ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి.. జగన్ పార్టీ భూస్థాపితం ఖాయం' - TDP pressmeet
Somireddy Chandramohan Reddy Fire on police: పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయన్న ఆయన.. జగన్ పార్టీ భూస్థాపితం ఖాయమని చెప్పారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 4న పుంగనూరులో అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణుల కవ్వింపు చర్యలకు వ్యతిరేకంగా వెంకటగిరిలో టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో పాటు 19మందిపై పోలీసులు కేసులు నమోదు చేయడం.. అధికార పార్టీకి తొత్తులుగా పని చేయడమే అని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో లేని వ్యక్తితో.. తనపై మాజీ ఎమ్మెల్యేతో పాటు మిగతా వారు హత్యాయత్నం చేశారని కట్టు కథ చెప్పించి కేసులు పెట్టించారని మండిపడ్డారు. కేసులు పెట్టించిన తర్వాత వైసీపీ నేతలు సొంత ఖర్చులతో విమానం టికెట్లు కొనుగోలు చేసి ఆ వ్యక్తిని బ్యాంకాక్ పంపారని.. ఇదంతా జిల్లా ఎస్పీకి తెలియదనుకోవాలా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. పుంగనూరులో 400మందిపై కేసులు పెట్టారు.. దాదాపు వెయ్యి మంది గ్రామాల్లో లేకుండా వేరే ప్రాంతాల్లో తలదాచుకునే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయన్న ఆయన.. జగన్ పార్టీ భూస్థాపితం ఖాయమని చెప్పారు. సమావేశంలో గూడూరు, తిరుపతి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే లు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, శ్రీకాళహస్తి ఇన్చార్జి తదితరులు పాల్గొన్నారు.