అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని.. బ్యాంక్ ఉద్యోగిపై దాడి - దళిత సంఘ నాయకులు దాడి
Attack on Person : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కారణంతో బాపట్ల జిల్లాలో ప్రైవేటు బ్యాంకు ఉద్యోగిపై దళిత సంఘ నాయకులు దాడి చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేయటమే కాకుండా.. వాటిని రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో ఉంచాడనే నెపంతో అతనిపై దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణానికి చెందిన ఈశ్వర్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నాడు. అంబేడ్కర్‌ను అవమానించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాడని.. అతనిపై సోమవారం రాత్రి దళిత సంఘాల నాయకులు దాడి చేశారు. దాడి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రగాయాలపాలైన ఈశ్వర్‌ను పోలీసులు సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని.. గుంటూరు జిల్లా ఆసుపత్రికి తరలించాలని వైద్యులు, పోలీసులకు సూచించారు. వైద్యుల సూచనల మేరకు పోలీసులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. దాడిలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించే సమయంలో.. పోలీసు వాహనం పైనా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి.. వాహనం అద్దాలు పగలగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దాడికి దిగిన వారిని పోలీసులు చెల్లచెదురు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.