Minister Viswaroop: పవన్‌పై నా వ్యాఖ్యలను వక్రీకరించారు: మంత్రి విశ్వరూప్ - ysrcp Minister Vishwaroop
Minister Pinipe Viswaroop comments On Pawan Kalyan: గత శుక్రవారం తిరుమలలో పవన్ కల్యాణ్ గురించి మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు.. తాను చెప్పిన సమాధానం వక్రీకరించడాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ ఖండించారు. తాను వైసీపీని విడిచిపెట్టి వెళ్లేది లేదని ఆయన తెల్చి చెప్పారు. రవాణా శాఖ మంత్రి పదవి ఇచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండోసారి రాజకీయ ప్రమోషన్ కల్పించారని ఆయన గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో తన నివాసం వద్ద ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలను వెల్లడించారు
తాను ప్రజల సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి విశ్వరూప్ వెల్లడించారు. తిరుపతిలో విలేకరులు అడిగిన ప్రశ్నకు.. తాను సమాధానం ఇస్తూ ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు ఉంటే ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు అని వెల్లడించినట్లు తెలిపిన ఆయన.. దాన్ని కొందరు మరో రకంగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాను ఎలాంటి వాడినో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రిని వదిలే ప్రసక్తి లేదని వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జగన్ కోసమే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. మంత్రిగా ఉన్న ఎవరికైనా పార్టీ మారే ఆలోచన ఎలా వస్తుందో ఆలోచించుకోవాలని విశ్వరూప్ తెలిపారు. తనపై అసత్య ప్రచారాలు చేయవద్దని సూచించారు.