Soil mafia in Bapatla: బాపట్ల జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు.. పట్టించుకోని అధికారులు - ap government
Soil mafia in Bapatla district : బాపట్ల జిల్లాలో మట్టిమాఫియా ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కొరిశపాడు మండలం తమ్మవరం గ్రామంలోని కొండ మట్టిని అద్దంకి తరలిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అద్దంకిలోని కొండ మట్టి తవ్వకాలపై ఈటీవీ భారత్లో కథనం రావటంతో అక్కడ తవ్వకాలను నిలిపివేశారు. ఇప్పుడు తమ్మవరం గ్రామం కొండ నుంచి కొన్నివేల టిప్పర్ల మట్టిని పగలు, రాత్రి తేడా లేకుండా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించడం తప్ప చేసేది ఏమీలేదని స్థానికులు అంటున్నారు. స్థానిక అధికారులు పైఅధికారులకు తెలియజేయడంతో సరిపెడుతున్నారు తప్ప ఏ చర్యలు తీసుకోలేకపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. అద్దంకి పట్టణంలో ప్రైవేటు వెంచర్లకు మట్టిని తరలించటానికి.. పక్క మండలాల నుంచి మట్టి తోలటం మొదలు పెట్టారని గ్రామస్థులు అంటున్నారు. జిల్లా స్థాయి అధికారులు కూడా వచ్చి చూసిపోవటం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. అక్రమంగా కొండ మట్టి తవ్వకాలపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి తరలింపులతో రోడ్లు పాడైపోతున్నాయని చెబుతున్నారు. జాయింట్ కలెక్టర్ రెవెన్యూ, మైనింగ్ అధికారులతో ఉత్తరప్రత్యుత్తరాలు జరపడం తప్ప శాశ్వతమైన చర్యలు చేపట్టినట్లు కనిపించటం లేదన్నారు.