Software Employees Huge Car Rally సొంతూరిపై మమకారమే కాదు..! చంద్రబాబుపై అభిమానం కూడా..! గ్రామ జాతర కొచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఏం చేశారంటే.. - ఏపీ టీడీపీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 19, 2023, 10:11 PM IST
Software Employees Huge Car Rally: అనంతపురం జిల్లాలోని పాలవెంకటాపురం గ్రామంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా కార్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామం కర్ణాటక సరిహద్దుకు కూత వేటు దూరంలో ఉంది. ఈ గ్రామంలో ప్రతి ఏడాది మారెమ్మ జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జాతరకు హాజరైన పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు చంద్రబాబు నాయుడును విడుదల చేయాలంటూ తమ కార్లతో ర్యాలీ నిర్వహించారు. బాబు దూరదృష్టితోనే తాము ఉన్నత స్థితిలో ఉన్నామని, తమకు ఉద్యోగం వచ్చిదంటే.. చంద్రబాబు చలవేనని వారు పేర్కొన్నారు. మేము సైతం బాబు కోసం అంటూ గ్రామానికి చెందిన పలువురు రైతులు కూడా తమ ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.
కార్లు, ట్రాక్టర్లతో ర్యాలీగా బయలుదేరి చంద్రబాబు నాయుడును వెంటనే విడుదల చేసే విధంగా కరుణించమని గ్రామదేవతను కోరుకున్నారు. మనస్పూర్తిగా ఈ జాతర చేయలేకపోతున్నామని, ఆనవాయితీగా హాజరు కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు లక్షలాది గ్రామీణ పిల్లలకు ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు ఎంతో కృషి చేశారని తెలిపారు. తమ కళ్ళల్లో ఆనందాలు నింపిన చంద్రబాబు నాయుడు ఆపదలో ఉంటే జీర్ణించుకోలేకపోతున్నామని గ్రామస్థులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు.