'ప్రాణం ఖరీదు రెండు రూపాయలు' ఆరో తరగతి విద్యార్ధి ఆత్మహత్య - అనంతపురం జిల్లా విద్యార్థి ఆత్మహత్య
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 1, 2023, 5:50 PM IST
Sixth Class Student Suicide for Rs.2 : ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పసిప్రాయంలోనే నూరేళ్లు నిండడంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలివీ.. స్కూలుకు వెళ్లేటప్పుడు తల్లి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కరిగానపల్లికి చెందిన బొమ్మలింగ ఆరో తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే స్కూలుకు వెళ్లే ముందు... రెండు రూపాయలు కావాలని తల్లిని అడిగాడు.
రెండు రూపాయలు అడిగితే.. 'రెండు రూపాయలు ఎందుకు.. అక్కడ పది రూపాయలు ఉన్నాయి తీసుకో' అని చెప్పానని, అయినా తన కుమారుడు ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డాడని విద్యార్థి తల్లి జయమ్మ రోదిస్తోంది. జయమ్మ, ఈరన్నకు బొమ్మలింగ ఒక్కగానొక్క కొడుకు కావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉరి వేసుకున్న బొమ్మ లింగ కొనప్రాణాలతో ఉన్నాడనే ఆత్రుతతో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. ఇక్కడికి తీసుకొచ్చేలోగా బాలుడు చనిపోయాడని వైద్యులు చెప్పారని కుటుంబసభ్యులు తెలిపారు. బొమ్మలింగ మృతితో బంధువుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం నిండిపోయింది.