SREERAM NAMES ON SAREE: అయోధ్య సీతమ్మకు అరుదైన బహుమతి.. 32,200 శ్రీరామ నామాల పట్టుచీర - బాపట్ల జిల్లాలో సీతమ్మకోసం నేసిన పట్టుచీర ప్రదర్శన
SREERAM NAMES SAREE SHOW: బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో సీతమ్మవారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన 160 అడుగుల పొడవున్న చీర ప్రదర్శన కార్యక్రమం జరిగింది. అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిరం కోసం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన నాగరాజు అనే చేనేత కార్మికుడు ఈ పట్టు చీరను తయారు చేశారు. 16 కేజీల పట్టు వస్త్రంపై దేశంలోని 13 భాషల్లో 32వేల 200 శ్రీరామ నామాలను ముద్రించారు. దీంతో పాటు ఆ చీరలో రామాయణంలోని 168 ప్రధాన ఘట్టాలను కూడా ముద్రించారు. ఈ చీర తయారీలో సహజ సిద్ధమైన రంగులను మాత్రమే ఉపయోగించి, భక్తి శ్రద్ధలతో నేసినట్లు నేతన్న తెలిపారు. దీంతో పాటు ఈ చీర తయారీ కోసం సుమారు 2లక్షల వరకు ఖర్చు చేసినట్లు నాగరాజు చెప్పారు. సీతమ్మవారి కోసం తయారు చేసిన ఈ ప్రత్యేక చీరను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు.. ప్రదర్శనా స్థలానికి తరలివచ్చారు. త్వరలో యూపీ ప్రభుత్వ అనుమతితో అయోధ్య రామమందిరానికి ఈ చీరను నేతన్న బహుకరించనున్నారు.