SI Candidates fire on selection process: గతంలో అర్హులం.. ఇప్పుడెలా కాదు..! ఎస్ఐ అభ్యర్థుల ఆందోళన..
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 16, 2023, 7:44 PM IST
SI Candidates fire on selection process: హైకోర్టు ఆదేశాల మేరకు దేహదారుఢ్య పరీక్షలకు హాజరైన 95 మంది ఎస్ఐ అభ్యర్థుల్ని కావాలనే ఎత్తు, ఛాతీ కొలతల్లో అధికారులు అనర్హులుగా నిర్ణయించారని ఎస్ఐ అభ్యర్థులు ఆరోపించారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిబంధనల ప్రకారం 167.6 సెం.మీటర్ల ఎత్తు ఉన్న అభ్యర్థులు ఎస్ఐ ఉద్యోగానికి అర్హులు కాగా, అధికారులు కావాలని జుట్టు దువ్వి, కాళ్లు లాగి తక్కువ ఎత్తు నమోదు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. 2016, 2018, 2019 లో నిర్వహించిన ఎస్ఐ దేహ దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన తాము.. 2023లో ఎలా అనర్హులమంటూ కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు.
విచారణ జరిపిన ధర్మాసనం ఎత్తు కొలిచే విషయంలో పరికరాల తప్పిదం వల్ల అభ్యర్థులు అర్హత కోల్పోవడంపై అభ్యతరం వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. గతంలో అర్హత సాధించిన అభ్యర్థులకు మళ్లీ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని, యంత్రంతో కాకుండా సాధారణ పద్ధతుల్లోనే ఎత్తు కొలవాలని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించిందని అభ్యర్థులు తెలిపారు. అయితే అధికారులు మళ్లీ 95 మందికి పరీక్షలు పెట్టాలనే ఉద్దేశ్యంతో కావాలనే.. అభ్యర్థుల కొలతల్ని తక్కువగా నమోదు చేసి అందరిని అనర్హులుగా ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఎస్ఐ ఉద్యోగం కోసం కష్టపడుతున్నామని, ఇలా కావాలని అనర్హత వేస్తే చావే శరణ్యమని వాపోయారు. నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలుగు యువత, విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు.