శ్రావణమాసం.. అమ్మవారి ఆలయాల్లో తొలి శుక్రవారం పూజలు
Shravana Masam First Friday Pujas in Temples : శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పూజలు వైభవంగా జరుగుతున్నాయి. అన్ని ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలను, దేవతలను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు, వ్రతాలు, కుంకుమపూజలు నిర్వహిస్తున్నారు. వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అమ్మవార్ల ఆలయానికి భక్తులు పోటేత్తారు. వేకువ జాము నుంచే భక్తులు అమ్మవార్లను దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో భక్తులు ప్రత్యేక కుంకుమ పూజలు, అభిషేకాలు చేశారు. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి అలయం భక్తులతో కళకళలాడింది. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. శ్రావణ శుక్రవారం కావటంతో.. అమ్మవారిని గాజులతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసంలో శుక్రవారం రోజు అమ్మవారిని దర్శించుకుంటే సర్వ శుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.