Anakapalli Nookambika Utsav అనకాపల్లి నూకాంబిక ఆలయంలో శాకంబరి ఉత్సవాలు.. పోటెత్తిన భక్తులు.. - అనకాపల్లి లేటెస్ట్ న్యూస్
Anakapalli Nookambika Shakambari Utsavalu: అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారి ఆలయంలో శాకంబరి దేవి ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆలయ ప్రాంగణాన్ని, దేవతాముూర్తులను.. కూరగాయలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించడంతో.. ఆలయం శోభాయమానంగా మారింది. కాయగూరల ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ అమ్మవారిని శాకంబరీగా అలంకరించేందుకు అవసరమైన అన్ని కూరగాయలను సమకూర్చి భక్తిప్రపత్తులు చాటుకున్నారు. అర్చకులు, వేద పండితులు వేదమంత్రోత్సవాలతో అమ్మవారికి పూజలు చేసి మంగళ హారతులు సమర్పించారు. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో ఆలయం ప్రాంగణం జన సందోహంతో సందడి వాతావరణం నెలకొంది. కూరగాయలు, పండ్లతో సుందరంగా అలకరించిన అమ్మవారి అలంకరణ భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.