Tension in Yuvagalam Padayatra : యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత.. సుబ్బారెడ్డిపై దాడి - నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
Tension in Yuvagalam Padayatra : నంద్యాల జిల్లాలో యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ వర్గీయులు లోకేశ్ ఎదుటే దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. శ్రీశైలం నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేసుకుని.. నంద్యాల నియోజకవర్గంలో ప్రవేశించినప్పుడు స్వాగతం పలికేందుకు కొత్తపల్లి వద్దకు వచ్చిన సుబ్బారెడ్డిపై దాడి చేశారు. లోకేశ్ పాదయాత్ర చేస్తున్న సమయంలోనే.. అఖిల ప్రియ దగ్గరుండి దాడి చేయించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
నంద్యాలలో టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా టీడీపీ నాయకులు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, మరో నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి. లోకేశ్‌ను కలిసి వెళుతున్న ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిల ప్రియ అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఏవీ సుబ్బారెడ్డిని వేరే వాహనం ఎక్కించి పంపించారు.