హైకోర్టు స్టే ఇవ్వటం మార్గదర్శి సంస్థ నిబద్దతకు నిదర్శనం: సీనియర్ న్యాయవాది రాజేంద్రప్రసాద్ - Senior advocate SRP On Margadarsi Case
Senior Advocate Sunkara Rajendraprasad on Margadarsi Case: మార్గదర్శి చిట్ గ్రూపుల నిలిపివేతపై అభ్యంతరాలు తెలపాలని చందాదారులను కోరుతూ.. చిట్స్ రిజిస్ట్రార్ ఇచ్చిన బహిరంగ నోటీస్‌ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) ఈరోజు నిలుపుదల చేసింది. ఆ నోటీసు ఆధారంగా తీసుకోబోయే తదుపరి చర్యలను కూడా నిలువరించింది. చందాదారులు ఇప్పటికే వేసిన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినందున.. అన్నీ పిటిషన్లు కలిపి, విచారించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం పేర్కొంది. అంతేకాకుండా, చందాదారులు వేసిన వ్యాజ్యాలు.. మార్గదర్శి సంస్థ వేసిన వ్యాజ్యాలు.. ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది.
Senior advocate Rajendraprasad Comments.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థల పట్ల, చందాదారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కావాలనే మార్గదర్శిపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అయినా కూడా మార్గదర్శి సంస్థలపై చందాదారుల్లో ఏమాత్రం విశ్వాసం, నమ్మకం బలహీనపడలేదని వ్యాఖ్యానించారు. చిట్స్ రిజిస్ట్రార్‌లు ఇచ్చిన బహిరంగ నోటీసుల తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ ఈరోజు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. హైకోర్టు స్టే ఇవ్వటం మార్గదర్శి సంస్థ నిబద్దతకు నిదర్శనమని.. సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.