Attack on SEB station: తెలంగాణ మద్యం స్టాక్.. తప్పుడు కేసులు పెడుతున్నారని స్టేషన్‌పై దాడి..! - Attack on police in Puduguralla
Attack on SEB station: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని సెబ్ కార్యాలయంపై ఈ రోజు కొంత మంది దాడి చేసి విధులు నిర్వహిస్తున్న పోలీసులపై చేయి చేసుకున్నారని సీఐ కొండారెడ్డి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మాచవరం మండలం తురకపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద 13 బ్రాందీ సీసాలు, 20 బీర్ సీసాలు లభించాయి. అవి తెలంగాణ మద్యం కావడంతో వారు ఎక్కడి నుంచి తెచ్చారు అనే కోణంలో పోలీసులు విచారించారు. నిందితులు చెన్నైపాలెం గ్రామానికి చెందిన కొందరి పేర్లు చెప్పగా.. విచారణ నిమిత్తం వారిని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు. కాగా, తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారనే నెపంతో నరసింహ నాయక్ అనుచరులు 20 మందికి పైగా సెబ్ స్టేషన్లోకి వచ్చి విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై దాడి చేశారు. అనవసరంగా తప్పుడు కేసులు బనాయిస్తే ఊరుకునేది లేదని సీఐని హెచ్చరించారు. కాగా, ఎంతోమంది తెలంగాణ మద్యం తెచ్చి అమ్ముతుంటే వారిని పట్టుకోకుండా తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని నరసింహ నాయక్, అతడి బంధువులు పోలీసులను నిలదీశారు. సంబంధం లేని కేసులో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశామే తప్ప.. తాము ఎవరిపై దాడి చేయలేదని ఈ సందర్భంగా నరసింహ నాయక్ బంధువులు తెలిపారు. మద్యం తెలంగాణ నుంచి విచ్చలవిడిగా తరలిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఒకటి రెండు సీసాలు దొరికిన వాళ్లపై కేసులు బనాయించడం సరికాదన్నారు. కేసు కొట్టేద్దామని పోలీసులు చేసే ప్రయత్నంలోనే ఈ గొడవ జరిగినట్టు కొందరు చెప్తున్నారు.