SI misbehaved with student leaders: బస్సుల కోసం విద్యార్థులు ధర్నా.. దురుసుగా ప్రవర్తించిన ఎస్సై.. వీడియో వైరల్ - Prakasam district political news
Markapuram SI Sasikumar misbehaved with student leaders: ప్రకాశం జిల్లా మార్కాపురం ఎస్సై శశికుమార్ దురుసు ప్రవర్తనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కేంద్రీయ, మోడల్ స్కూల్స్ విద్యార్థులు తమ పాఠశాలలకు బస్సులు కేటాయించాలంటూ ధర్నా చేపట్టగా.. వారికి సీపీఎం, విద్యార్థి నాయకులు అండగా నిలిచి ధర్నా చేపట్టారు. రోడ్డుపై ధర్నా చేస్తారా..? అంటూ ఎస్సై ఆవేశంతో రగిలిపోయి దురుసుగా ప్రవర్తించారు. ఓ విద్యార్థి నాయకుడిపై దాడికి పాల్పడుతూ.. చొక్కా పట్టుకుని స్టేషన్‌కు లాక్కెళ్లారు. దీంతో ఎస్సై తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు.
విద్యార్థి నాయకుడిపై ఎస్సై దురుసు ప్రవర్తన.. తమ పాఠశాలలకు బస్సులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. ప్రకాశం జిల్లా మార్కాపురం స్థానిక కోర్టు కూడలిలో కేంద్రీయ విద్యాలయం పాఠశాల విద్యార్థులు, సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మోడల్ స్కూల్ విద్యార్థులు రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రెండు పాఠశాలలకు బస్సులు పూర్తిగా రద్దు చేస్తే.. తమ పిల్లలు పాఠశాలలకు ఎలా వెళ్తారు..? అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. రోడ్డుపై నిరసన తెలుపుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, సీపీఎం నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. విద్యార్థి నాయకుడు సురేష్‌పై ఎస్సై శశికుమార్ దాడికి పాల్పడ్డారు. చొక్కా పట్టుకుని లాక్కెళ్లి స్టేషన్‌కు తరలించారు. ఎస్సై తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ఇంటిని విద్యార్థులు ముట్టడించారు. తమ పాఠశాలకు వెంటనే బస్సులు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఉన్నతాధికారులతో మాట్లాడి.. బస్సుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు.