School Bus Accident: పంట పొలాల్లో పల్టీకొట్టిన స్కూల్ బస్సు.. 14మంది విద్యార్థులకు గాయాలు - తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి
School Bus Accident : స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఊహించని ప్రమాదం పలు కుటుంబాలను ఆందోళనలో ముంచెత్తింది. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివీ.. కూచిపూడిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో స్వాతంత్ర్య వేడుకలు ముగిసిన వెంటనే విద్యార్థులు తిరిగి ఇళ్లకు బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు పెదపూడి సమీపిస్తుండగా... మరో స్కూల్ బస్ను ఓవర్ టేక్ చేసేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అతి వేగం కారణంగా బస్సును డ్రైవర్ అదుపుచేయలేకపోవడంతో... పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది విద్యార్థులు ఉండగా.. 14 మంది గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, అటుగా వెళ్లే వాహనదారులు అప్రమత్తమై విద్యార్థులను కాపాడి బయటకు తీశారు. గాయపడిన వారిని అంబులెన్స్ సహాయంతో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిందనే విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఆయా గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు.