SC Colony Women Andolana: మురుగునీటి సమస్య పరిష్కరించాలని.. గ్రామసచివాలయం మూసి మహిళల ఆందోళన - ఎస్సీ కాలనీ మహిళలు ఆందోళన
SC Colony Women Andolana in Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం చందాపురం గ్రామ సచివాలయం తలుపులు మూసేసి ఎస్సీ కాలనీ మహిళలు ఆందోళన చేపట్టారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో మురుగునీరు వెళ్లేందుకు సరైన డ్రైన్లు లేకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోతుందన్నారు. కాలనీలో మురుగు నీరు దిగవనున్న పంట పొలంలోకి అనుమతించకపోవడంతో ఎటు వెళ్లడానికి వీలుకావటంలేక అక్కడ ఆగిపోతున్నాయని ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని గ్రామంలోని సర్పంచ్‌తో పాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవట్లేదన్నారు. మురుగునీరు నిల్వ ఉండటం వల్ల వ్యాధులు వస్తున్నాయని భయాందోళన చెందుతున్నారు.
సమస్య పరిష్కరించాలని కోరుతూ ఉదయం 10 గంటల సమయంలో గ్రామ సచివాలయం వద్దకు చేరుకొని సచివాలయం తలుపులు మూసేశారు. అప్పటికే లోపలికి వెళ్లిన ఉద్యోగులను బయటికి రాకుండా తలుపులు వేశారు. డ్రెయిన్లు నిర్మించాలని, న్యాయం చేయాలని కోరుతూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో శ్రీనివాసరావుతో పాటు రెవెన్యూ ,ఎన్ఎస్పీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చించారు. తమ సమస్య పరిష్కరించే వరకు సచివాలయం తలుపులు తీయమని అడ్డంగా కూర్చుని ఆందోళన చేస్తున్నారు. అనంతరం అధికారులు ఎస్సీ కాలనీలో కాలువలను పరిశీలించారు.